 
															తెరుచుకున్న జలాశయాల గేట్లు..
మదనాపురం/వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: మండలంలోని సరళాసాగర్ జలాశయం ఆటోమెటిక్ సైఫన్లు బుధవారం తెరుచుకున్నాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో జలాశయంలో నీటిమట్టం పెరగడంతో ఒక ఉడ్ సైఫన్, ప్రైమరీ సైఫాన్ తెరుచుకొని 3,950 క్యూసెక్కుల నీరు దిగువకు పారింది. దీంతో ఊకచెట్టు వాగులో నీటి ప్రవాహం కొనసాగింది.
● రామన్‌పాడు జలాశయానికి కోయిల్‌సాగర్ నుంచి వరద చేరడంతో బుధవారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లు పైకెత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ముందస్తు జాగ్రత్తగా పరిసర గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
● శ్రీరంగాపురం రంగసముద్రం రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో బుధవారం తహసీల్దార్ రాజు గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
● కొత్తకోట మండలం కానాయపల్లి శివారులో ఉన్న శంకరసముద్రం జలాశయానికి బుధవారం స్వల్పంగా వరద చేరడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. జలాశయానికి ఎగువ నుంచి 2,400 క్యూసెక్కుల వరద రాగా.. మూడు గేట్లను 1.5 ఫీట్ల పైకెత్తి 2,100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఏఈ మనోజ్‌కుమార్ వివరించారు. వరద తగ్గుముఖం పట్టినా ముందస్తు జాగ్రత్తగా 3 గేట్లను ఎత్తినట్లు వెల్లడించారు.
 
							తెరుచుకున్న జలాశయాల గేట్లు..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
