 
															ఆయుధాల భద్రతలో జాగ్రత్తలు తప్పనిసరి
వనపర్తి: ఆయుధాల భద్రతలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచిందారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన డీఎస్పీ శ్రీనివాసులు బృందం వార్షిక ఆయుధాల తనిఖీల్లో భాగంగా గురువారం వనపర్తి సాయుధదళ పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. ఆయుధాల సంరక్షణ, రికార్డుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, వినియోగ విధానాలను పరిశీలించింది. విషయం తెలుసుకున్న ఎస్పీ అక్కడికి చేరుకొని మాట్లాడారు. సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతతో వ్యవహరించడంలోనే పోలీసుశాఖ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. సాయుదదళ పోలీసులు వ్యవస్థకు వెన్నెముక లాంటివారని.. క్రమశిక్షణ, ఏకత్వం, సమగ్రతతో విధులు నిర్వర్తించడంతోనే ప్రజల్లో విశ్వాసం, భద్రతా భావం పెంపొందుతుందని తెలిపారు. ఆయుధాల వినియోగంపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రావీణ్యం, పనితీరు మరింత మెరుగవుతాయన్నారు. కార్యక్రమంలో సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఆయుధాల తనిఖీ బృందం అధికారి, వనపర్తి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, తనిఖీ బృందం సిబ్బంది, ఏఆర్ ఎస్సై రహమాన్, హెడ్ కానిస్టేబుళ్లు వెంకట అప్పారావు, అరవింద్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
● పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించే 2కే రన్‌ను విజయవంతం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యువత, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని పిలుపునిచ్చారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
