 
															2కే రన్ విజయవంతం చేయాలి
వనపర్తి: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలో జాతీయ సమైక్యత దినోత్సవ 2కే రన్ నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 7 గంటలకు జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానం వద్ద రన్ ప్రారంభమై ఆర్డీఓ కార్యాలయ చౌరస్తా మీదుగా కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ముగుస్తుందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, క్రీడాకారులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రన్‌లో పాల్గొనే వారికి తాగునీరు, పండ్లు, అంబులెన్స్, మ్యూజిక్ సిస్టం తదితర సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
