 
															శాసీ్త్రయ విద్యను దూరం చేస్తున్న కేంద్రం
● పీడీఎస్‌యూ జాతీయ ప్రతినిధి
విజయ్ కన్నా
వనపర్తిటౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో మతపరమైన మూఢ విశ్వాసాలను పొందుపర్చి భవిష్యత్ తరాలకు శాసీ్త్రయ విద్యను దూరం చేస్తోందని పీడీఎస్‌యూ జాతీయ ప్రతినిధి విజయ్‌కన్నా ఆరోపించారు. జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న పీడీఎస్‌యూ రాష్ట్ర 4వ మహాసభల్లో గురువారం విద్యారంగ పరిస్థితులపై జరిగిన సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి సభాధ్యక్షత వహించగా.. ముఖ్యఅతిథిగా విజయ్ కన్నా హాజరై మాట్లాడారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీలను నిబంధనల మార్పుతో కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. జ్యోతిష్యంలో డిగ్రీ పట్టా ఇవ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ హామీల అమలును కమిటీలతోనే సరిపెడుతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వం తరహాలోనే విద్యారంగానికి నిధులు తగ్గించి పేదవాడికి విద్యను దూరం చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను వ్యాపారంగా.. బీజేపీ కాషాయికరణగా మార్చుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు తీవ్రతరం చేస్తేనే పాలక వర్గాల్లో మార్పు వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాంబ, ఉపాధ్యక్షులు సతీష్, పవన్, రంజిత్, సహాయ కార్యదర్శి గణేష్, రాష్ట్ర నాయకులు సైదులు, వంశీ, వంశీకృష్ణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
