 
															ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
వనపర్తి: మోంథా తుపానుతో జిల్లావ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయని.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సమయంలో ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేట, నీళ్లలో ఆట ప్రమాదకరమని హెచ్చరించారు. వర్షాలకు రహదారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు. రైతులు తమ పశువులు, వ్యవసాయ సామగ్రిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, పిల్లలు, వృద్ధులు నీటిముంపు ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ వాట్సాప్ నంబర్ 63039 23200 సమాచారం అందించాలని, తక్షణ సహాయక చర్యలకు జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలి
వనపర్తి: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 10,958 ఎకరాల్లో మొక్కజొన్న సాగుకాగా.. సుమారు 2,73,800 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. అత్యధికంగా చిన్నంబావి మండలంలో 7,492 ఎకరాల్లో పంట సాగు చేసినట్లు చెప్పారు. జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల, గోపాల్‌పేట, చిన్నంబావిలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పంట కోతలు ప్రారంభమయ్యాయని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 మద్దతు ధర నిర్ణయించిందని.. రైతులు దళారులకు తక్కువ ధరకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. రైతులు తేమశాతం 14 మించకుండా తీసుకురావాలన్నారు. పంట విక్రయాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మార్క్‌ఫెడ్ అధికారి చంద్రమౌళి (సెల్‌నంబర్ 99898 04756) సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మార్క్‌ఫెడ్ అధికారి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
చివరి గింజ వరకు
కొంటాం : ఎమ్మెల్యే
కొత్తకోట రూరల్: అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. పెద్దమందడి మండలం వెల్టూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మొదటి విడత జిల్లావ్యాప్తంగా 396 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో మహిళా సంఘాలు 170, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 218, మెప్మా ఆధ్వర్యంలో 8 కేంద్రాలు ఉన్నాయన్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రమేష్‌గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌నాయక్, రఘుప్రసాద్, సింగిల్‌విండో అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి, రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
 
							ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
 
							ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
