
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో 3 వైద్యాధికారుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 19 వరకు అవకాశం ఉందని.. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను పూర్తి ధ్రువపత్రాలతో డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఇతరులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 డీడీ జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీస్, వనపర్తి పేర తీయాలని, దరఖాస్తునకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన బోనఫైడ్, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ మెమో, ఎంబీబీఎస్ రిలేటెడ్ మెమో, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ జిరాక్స్‌లు జత చేయాలని సూచించారు.
నేడు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ రాక
వనపర్తి: జిల్లాలోని క్రైస్తవుల సమస్యలపై చర్చించడానికి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్‌జాన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు వస్తున్నట్లు జిల్లా మైనార్టీ అధికారి అఫ్జలుద్దీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగే సమవేశంలో క్రైస్తవుల శ్మశానవాటికకు స్థలం కేటాయింపు, భూ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్, చర్చి నిర్మాణం తదితర సమస్యలతో పాటు కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రధానమంత్రి 15 పాయింట్ ఫార్ముల అమలుపై చర్చిస్తారని.. జిల్లాలోని పాస్టర్లు, పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రైస్తవ మత పెద్దలు హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.
రోబోటిక్స్‌పై
విద్యార్థులకు అవగాహన
కొత్తకోట: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోహమ్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏఎండీ సహకారంతో సోమవారం రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. అకాడమీ డైరెక్టర్ కొమరగిరి సహదేవ్ పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు దేవని ప్రవీణ్‌కుమార్‌తో కలిసి వర్క్‌షాప్ ప్రారంభించారు. ఒక్కో బ్యాచ్‌లో ముగ్గురు విద్యార్థుల చొప్పున మొత్తం 50 బ్యాచ్‌లలో ఎలక్ట్రానిక్స్ ప్రాథమికాలు, సెన్సార్లు, మోటార్లు, రోబోటిక్ సూత్రాలు, హార్డ్‌వేర్ వినియోగం, ప్రాజెక్టు డిజైన్, డెవలప్‌మెంట్ గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించారని ఆయన కొనియాడారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, పాఠశాలకు రోబోటిక్స్ కిట్లను సోహం అకాడమీ అందజేసిందని ప్రిన్సిపాల్ వివరించారు. కార్యక్రమంలో అకాడమీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జస్వంత్, టీం లీడర్ దినేష్, 12 మంది శిక్షకులు, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ప్రవీణ్‌రెడ్డి, సుమ, సుధారాణి, రామకృష్ణ పాల్గొన్నారు.
జెడ్పీ ఉన్నత పాఠశాలో..
అమరచింత/ఆత్మకూర్: అమరచింతలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆత్మకూర్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం సోహం అకాడమీ ఆధ్వర్యంలో రోబోటిక్స్‌పై ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్, సెన్సార్లు, మోటార్లు, రోబోటిక్స్ సూత్రాలను శిక్షకులు ప్రయోగాత్మకంగా వివరించారు. ఆధునిక కాలం కంప్యూటర్, ఏఐతో ముందకు సాగుతోందని.. ప్రతి విద్యార్థి వీటి గురించి తెలుసుకొని పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షకుడు శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
చిన్నంబావి: మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా కాంగ్రెస్ తన 41 ఏళ్ల ప్రయాణంలో అనేక విజయాలు సాధించిందన్నారు. మహిళా సాధికారత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేస్తూ దేశ నిర్మాణంలో మహిళల శక్తిని వెలుగులోకి తెచ్చిందని గుర్తు చేశారు. చట్టసభల్లో హక్కులు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రధానపాత్ర పోషిందన్నారు. గతంలో రాష్ట్రంలో కూడా మహిళలపై అనేక దాడులు జరిగాయని.. రెండేళ్లుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం