
స్వచ్ఛత.. ప్రతి ఒక్కరి బాధ్యత
అమరచింత: స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ఇళ్లలోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా పురపాలిక ఆటోలు, ట్రాక్టర్లలో వేసి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్‌లోని క్యాంపు కార్యాలయంలో అమరచింత పురపాలికకు కేటాయించిన 2 ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పురపాలిక పరిశుభ్రంగా ఉండేందుకు పుర కార్యాలయాలకు చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు, ఆటోలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పురపాలికలకు మాత్రమే వాహనాలు కేటాయించగా అందులో అమరచింత ఉండటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో పుర మేనేజర్ యూసుఫ్, పీసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ కార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి, అరుణ్, మార్కెట్ డైరెక్టర్లు శ్యాం, విష్ణు, మోహన్, తౌఫిక్, అశు పాల్గొన్నారు.