
‘పీఎం దక్ష’తో దివ్యాంగులకు ప్రయోజనం
వనపర్తి రూరల్: దివ్యాంగులు పీఎం దక్ష యోజనలో వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని సూచించారు. సోమవారం పెబ్బేరు మండలంలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానసిక, శారీరక దివ్యాంగ బాలలను పునరావాస కేంద్రాల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. అదేవిధంగా దివ్యాంగ్ జన్‌కౌశల్ వికాస్ పథకం గురించి వివరించారు. దివ్యాంగులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని.. టోల్‌ఫ్రీ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మోటారు వాహనాలు, ఉచిత నిర్బంధ విద్య, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా మహాత్మా జోతిబాపూలే పాఠశాలను సందర్శించి లీగల్ లిటరసీ క్లబ్‌ను ప్రారంభించి క్లబ్‌లో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వర్తించాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ ఓబుల్‌రెడ్డి, హెచ్‌ఎం కవిత, లీగల్ వలంటీర్లు సుశీల, శేఖరాచారి పాల్గొన్నారు.