
అన్యాక్రాంతమైన భూమిని పేదలకు పంచాలి
వనపర్తిటౌన్: తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల్లో చుక్క నీటిని ఆంధ్రాకు తరలించేందుకు ఒప్పుకోనంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. భూస్వాములు అన్యాక్రాంతం చేసిన భూములు అర అంగులం కూడా ఉండనివ్వమని ఎందుకు ప్రకటించడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డా.విశారధన్ ప్రశ్నించారు. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నీటిని దక్కించుకోవడం మంచిదే అని.. మరి అన్యాక్రాంతంగా ఉన్న భూమిని పేదలకు పంచేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ప్రపంచంలో అధికారం ఏ ఒక్కరి చేతుల్లో లేదని.. తెలంగాణలో మాత్రమే ఇద్దరి కులాల నడుమ బంధీ అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సమాజంలో వనరులు పరిమితంగా ఉంటుండగా.. ప్రజల అవసరాలు అపరిమితంగా ఉంటున్నాయన్నారు. ఈ రెండింటి మధ్య వారధి కట్టే రాజకీయాన్ని నిరుపేద ప్రజలు చేజిక్కించుకుంటేనే భవిష్యత్ పూలబాటగా మారుతుందని వివరించారు. బడుగు బలహీన వర్గాలు అతి మంచితనంతో రాజకీయాలకు దూరంగా ఉండటం సరికాదని అన్నారు. రూ. 12వేల కోట్ల ఆస్తు లు, రూ. 6కోట్ల పార్టీ ఫండ్ ఉన్న బీఆర్‌ఎస్‌లో నలు గురి కోసం కొట్లాడుకుంటున్నారని, బీఆర్‌ఎస్‌ను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అప్పజెబుతున్నట్లు కేసీఆర్ ప్రకటిస్తే కాంగ్రెస్ అధికారం ఒక్క క్షణంలో నేలకూలుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల సమానత్వ సాధనకు సాగిస్తున్న సమరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగం కుమారస్వామి, లక్ష్మీకాంత్, రాము యాదవ్, పెబ్బే టి నిరంజన్, శంకర్ యాదవ్, సతీశ్ యాదవ్, కార్తీక్ ఏకలవ్య, బండాలయ్య, బీచుపల్లి యాదవ్, రమేశ్‌గౌడ్, దయానంద, బలరాం, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, శ్రీనుయాదవ్ పాల్గొన్నారు.