
బకాయి వేతనాలు చెల్లించాలని ఆందోళన
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసే రోజువారీ కూలీ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల గేట్ ఎదుట చేస్తున్న ఆందోళన శనివారం రెండోరోజు కొనసాగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మండ్ల రాజు పాల్గొని వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. జిల్లాలో 16 మంది కార్మికులు పని చేస్తున్నారని.. వారికి 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.11,500 వేతనం చెల్లిస్తూ పెంచకుండా వెట్టిచాకిరి చేయించుకుంటోందని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు ఐదేళ్లు నిండిన వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణమ్మ, రాజు, చెన్నకేశవులు, పార్వతమ్మ, పద్మ, వెంకటమ్మ, సక్రి తదితరులు పాల్గొన్నారు.