
రాజీయే రాజమార్గం
వనపర్తిటౌన్: కక్షిదారులు కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకొని మానసిక ప్రశాంతత పొందడంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎంఆర్ సునీత అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వనపర్తి, ఆత్మకూర్ కోర్టుల్లో రాజీ ప్రక్రియలు న్యాయవాదులు, న్యాయమూర్తుల సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీతో రూపుమాపుకోవడం వ్యక్తిగత, కుటుంబ జీవితం, సమాజంలో మానసిక ధృడత్వంగా ఉండేందుకు దోహదపడతాయని వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకునేలా కక్షిదారులకు అవగాహన కల్పిస్తుందన్నారు. జిల్లా పరిధిలోని కోర్టుల్లో శనివారం జరిగిన లోక్ అదాలత్‌లో 9,180 కేసులు పరిష్కారమైనట్లు వివరించారు. ఇందులో సివిల్ కేసులు 26, క్రిమినల్ కేసులు 2,624, ప్రీ లిటిగేషన్ కేసులు 6,530 ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె.కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి బి.శ్రీలత, సెకండ్ అడిషనల్ జూని యర్ సివిల్ న్యాయమూర్తి ఎన్.అశ్విని, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
రూ.29.30 లక్షల జరిమానా..
ఆత్మకూర్: స్థానిక మున్సి్‌ఫ్ మెజీస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతమైంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి శిరీష మాట్లాడుతూ.. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. క్షణికావేశంలో కేసులు నమోదు చేసుకొని కోర్టుల చుట్టూ తిరుగడంతో ఎంతో విలువైన సమయం వృథా అవుతుందన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని పేర్కొన్నారు. అనంతరం వివిధ రకాల క్రిమినల్ కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఇతర పోలీస్ కేసుల ద్వారా రూ.29.30 లక్షల జరిమానాలు, మొత్తం 408 కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, లోక్‌అదాలత్ సిబ్బంది, ఆయా మండలాల పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో
9,180 కేసుల పరిష్కారం

రాజీయే రాజమార్గం