
కోర్టుల్లో ‘మధ్యవర్తిత్వం’
నెలాఖరు వరకు కొనసాగనున్న స్పెషల్ డ్రైవ్
● కక్షిదారులకు అవగాహన కల్పిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు
● లోక్ అదాలత్‌లో మూడేళ్లలో 32,288 కేసులు పరిష్కారం
● ఈ నెల 13న
జాతీయ మెగా లోక్‌అదాలత్
వనపర్తిటౌన్: జిల్లాలోని 9 కోర్టుల్లో దేశం కోసం మధ్యవర్తిత్వం (మీడియేషన్ ఫర్ ద నేషన్) కార్యక్రమం కొనసాగుతోంది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్‌లోనే కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు 90 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జూలై 1న ప్రారంభమై సెప్టెంబర్ చివరి వరకు కొనసాగే ఈ కార్యక్రమం ద్వారా విడాకులు, భరణం, చెక్‌బౌన్స్, క్రిమినల్ కేసులు పరిష్కరించుకునే వీలు కల్పించారు. మధ్యవర్తిత్వంలో భాగంగా జిల్లాలో అనుభవం ఉన్న ఇద్దరు న్యాయవాదులకు రాష్ట్రస్థాయిలో శిక్షణనిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకోదలచిన కక్షిదారుల అభిప్రాయాలను న్యాయవాదులు వేర్వేగా తెలుసుకొని లోటుపాట్లను గుర్తిస్తారు. తర్వాత ఒకేదగ్గర కూర్చోబెట్టి సేకరించిన వివరాలను వివరించి పరిష్కరిస్తారు. లోపాలను క్షుణ్ణంగా కక్షిదారులకు వివరించి మధ్యవర్తిత్వంతో ఆర్డర్ జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో మధ్యవర్తిత్వం వహించే న్యాయవాదులకు కక్షిదారులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్టులే కేసు ప్రాధాన్యం ఆధారంగా న్యాయవాదులకు పారితోషికం చెల్లిస్తుంది. జిల్లాలోని వనపర్తి, ఆత్మకూర్ న్యాయస్థానాల్లో ఇప్పటి వరకు 654 కేసులను గుర్తించగా.. 95 కేసులు మీడియేషన్‌కు బెంచ్‌కి వచ్చాయి. 10 కేసు లు పరిష్కరించగా.. మిగతా వాటిని కక్షిదారుల్లో అవగాహన పెంపొందించి పరిష్కరించనున్నారు.
లోక్ అదాలత్‌లో
32,288 కేసుల పరిష్కారం..
కక్షిదారులు రాజీపడి లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకొనే కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2023 నుంచి 2025, సెప్టెంబర్ 10వ వరకు మూడేళ్లలో జరిగిన లోక్‌అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 32,288 కేసులు పరిష్కారమయ్యాయి. 2023లో 4,153, 2024లో 13,698, 2025 సెప్టెంబర్ 10వ తేదీ వరకు 14,437 కేసులు పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్‌తో కక్షిదారుల రాజీకి న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా వాహన చలాన్లు, విద్యుత్ చౌర్యం, బ్యాంకు రుణాలు, టెలిఫోన్ కేసులు ఉండగా, తర్వాతి స్థానంలో సివిల్, క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఏడాది వారీగా పరిష్కారమైన కేసులు
సంవత్సరం యాక్సిడెంట్ సివిల్ క్రిమినల్ ప్రీ లిటిగేషన్
2023 9 24 3,789 331
2024 33 45 7,001 6,619
2025 8 26 14,403
(ఇప్పటివరకు)
(క్రిమినల్, ప్రీ లిటిగేషన్)