గురుకులాలకు నాణ్యమైన బియ్యం
వనపర్తి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ గురుకులాలకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం జగన్మోహన్‌తో కలిసి అన్ని సంక్షేమ గురుకులాల డీసీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాసిరకం బియ్యం వస్తే వెంటనే తిప్పి పంపించాలని సూచించారు. బియ్యం సరఫరాలో ఏవైనా సమస్యలుంటే గురుకులాల ఇన్‌చార్జ్‌లు, డీసీఓలు వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత లేని బియ్యంతో వండిన అన్నం విద్యార్థులకు అందించవద్దని కోరారు. సమావేశంలో జిల్లా మైనార్టీ అధికారి అఫ్జలుద్దీన్, జీసీడీఓ శుభలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


