
ప్రారంభం కాని రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయింపు
ఇదీ అసలు కథ..
వనపర్తి: అధికారులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారనేందుకు గత యాసంగిలో ధాన్యం కేటాయింపులను పరిశీలిస్తే అవగతమవుతోంది. ఓ పక్క కలెక్టర్ సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయించొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు పలు సమీక్షల్లోనూ వెల్లడించారు. కానీ పౌరసరఫరాలశాఖ అధికారులు మాత్రం కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రారంభం కాని మిల్లుకు గత యాసంగిలోనే అక్షరాల 1.72 లక్షల బస్తాల ధాన్యం కేటాయించారు. మిల్లులో యంత్రాలు నడవకుండా బియ్యం ఎలా ఇవ్వగలరనే కనీస ఆలోచన చేయకుండా ధాన్యం కేటాయించడం.. అందుకు ఆయా శాఖల అధికారులతో కూడిన కమిటీ సైతం తప్పుడు నివేదికతో మోసం చేసి సంతకాలు చేసేంత అవసరం సదరు అధికారికి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
మరో విడ్డూరం..
ఇప్పటికీ ఇంకా మిల్లు ప్రారంభం కాలేదు.. రా మిల్లు పేరుతో ధాన్యం కేటాయించిన ఆ ప్రదేశంలో ప్రస్తుతం బాయిల్డ్ మిల్లు నిర్మాణం చేపడుతున్నారు. ఇటీవలే యంత్రాలు బిగించినా.. విద్యుత్ సరఫరా లేదు. కానీ తప్పుడు నివేదిక ఆధారంగా ఆయా శాఖలను తప్పుదోవపట్టించి తీసుకున్న ధాన్యానికి సంబంధించి ఇప్పటికే 5,410 బస్తాల బియ్యం సదరు మిల్లరు పౌరసరఫరాల కార్పొరేషన్‌కు అప్పగించారు. మిల్లే నడవకుండా బియ్యం ఎలా అప్పగించారనే విషయం అధికారుల వద్ద సైతం లేకపోవడం గమనార్హం. జిల్లాలో విచ్ఛలవిడిగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ అవుతుందనేందుకు ఈ మిల్లర్ బియ్యం అప్పగించడమే ఉదాహరణగా చెప్పవచ్చు.
వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి మండలం మదిగట్ల శివారులో ప్లాస్టిక్ నీటిట్యాంకులు తయారయ్యే ఫ్యాక్టరీ ఉండేది. దీనిని రా రైస్‌మిల్లుగా చూపించి కోడ్ 43238 సంపాదించుకొని గత యాసంగిలో ధాన్యం తీసుకున్నారు. ఈ వ్యవహారం మదనాపురం మండలానికి చెందిన ఓ సీనియర్ మిల్లర్, ఇప్పటికే బ్లాక్ లిస్టులో ఉన్న వ్యక్తి నడిపించారు. తన పేరుతో ఇప్పటికే మిల్లు ఉండటంతో ధాన్యం కేటాయింపులు చేస్తే విషయం బహిర్గతం అవుతుందని పౌరసరఫరాలశాఖ అధికారి సలహా మేరకు అతను కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన ఓ రేషన్ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఆయన పేరుతో మిల్లు నిర్వహణ అనుమతి పొంది అక్కడ వరి ధాన్యం మర ఆడించే యంత్రాలు లేకపోయినా ధాన్యం కేటాయింపులు చేయించుకునే విషయంలో సఫలీకృతులయ్యారు. రా మిల్లుకు భవిష్యత్ లేదని గుర్తించి అదే షెడ్‌ను మరింత పెద్దగా విస్తరించి బాయిల్డ్ మిల్లు నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటికి ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యుత్ కనెక్షన్ సైతం సింగిల్‌ఫేస్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్లాస్టిక్ నీటి ట్యాంకుల పరిశ్రమను
రా మిల్లుగా చూపించి..
5,410 బస్తాల బియ్యం
సీఎస్‌సీకి అప్పగించిన వైనం
బాయిల్డ్ మిల్లు ఏర్పాటుకు సన్నాహాలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక ఉత్తిదేనా?

ప్రారంభం కాని రైస్‌మిల్లుకు ధాన్యం కేటాయింపు