
విద్యార్థులను ప్రోత్సహించాలి
వనపర్తి: గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు నిర్వాహకులు అండగా ఉండి చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని సంక్షేమ శాఖల అధికారులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్, వసతిగృహ వార్డెన్లతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడమే కాకుండా పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యా సంస్థలో విద్యార్థి కమిటీ, ఫిర్యాదు పెట్టె ఏర్పాటు చేయాలని.. ఫిర్యాదు పెట్టే తాళం ప్రత్యేక అధికారి వద్ద మాత్రమే ఉండాలని సూచించారు. విద్యార్థి తన పేరు రాయకుండా సమస్యను కాగితంపై రాసి అందులో వేసేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి విద్యా సంస్థకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తూ వారంలో కచ్చితంగా తనిఖీ చేసేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని.. జటిలం కాకుండా చూడాలని ఆదేశించారు. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని.. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, జిల్లాలోని ఎస్‌ఓలు, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ..
ఈవీఎం గోదాం వద్ద పటిష్ట బందోబస్తు ఉన్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, సి–సెక్షన్ సిబ్బంది రాజేష్, నాగేంద్ర, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శంకర్, త్రినాథ్, పరమేశ్వరాచారి, కుమారస్వామి, జమీల్, ఇతర అధికారులు ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి