
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
వనపర్తి: మానవ తప్పిదంతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని.. సైబర్ పోలీసులు ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సైబర్ పోలీసు వారియర్స్‌తో సమావేశం నిర్వహించి సైబర్ నేరాల నియంత్రణ, ఛేదించడంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. సైబర్ వారియర్స్‌గా వారి అనుభవాలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నందున ప్రజలకు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. జిల్లా సైబర్‌సెల్‌తో సమన్వయంతో పనిచేస్తూ సామాజిక మాధ్యమాల్లో అనుమానాస్పద కంటెంట్‌పై నిఘా ఉంచాలని, డిజిటల్ ఫోరెన్సిక్, సైబర్ ఇంటలిజెన్స్ సేకరణ వంటి బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. బాధ్యతను నైతికంగా, చట్టబద్ధంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం వారికి టీ షర్టులు అందజేశారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మహేశ్వరరావు, సైబర్‌క్రైం ఎస్‌ఐ రవిప్రకాష్, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రావుల గిరిధర్