
అయోమయంలో జీపీఓలు!
వనపర్తి: ఏడాదిగా ఊరిస్తున్న వీఆర్వోల సొంతగూటి ప్రయాణం ఆపసోపాలు పడుతూ గమ్యం చేరుకున్నా.. సమస్యల వలయం వారిని వీడలేదన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. త హసీల్దార్లు, ఆర్‌ఐలు, సీనియర్ అసిస్టెంట్లు, ఉన్నతాధికారులకు లేని సర్వీస్ రూల్స్ జీపీఓలు గా మారిన వీఆర్వోలకు వర్తింపజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీపీఓల విషయంలో సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వకూడదనే ని బంధన పేర్కొనడంతో ఎందుకు సొంతగూటికి వ చ్చామా అన్న నిరాశ చాలామందిలో కనిపించింది.
● గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దుచేసి వారిని లక్కీడిప్ విధానంలో ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం విధితమే. కాంగ్రెస్ ప్రభుత్వం వారి అభ్యర్థన మేరకు స్వీయ దరఖాస్తులు స్వీకరించి మరోసారి అర్హత పరీక్ష నిర్వహించి వీఆర్వో పోస్టును జీపీఓగా మార్చి ఇటీవల సొంత జిల్లాకు పంపించినా.. స్థానికత ఆధారంగా సొంత నియోజకవర్గంలో పని చేయడానికి అవకాశం లేకుండా చేయడంతో దూరాభారం తప్పడం లేదు. ఉదాహరణకు ఖిల్లాఘనపురంలో నివాసం ఉండే ఉద్యోగిని కొల్లాపూర్, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గంలోని మండలాలకు పంపించారు. ఈ మేరకు పోస్టింగ్ ఇచ్చేందుకు వారితోనే ఆప్షన్లను స్వీకరించారు. ఈ పరిస్థితి చూసి తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి తనను తిరిగి వెనక్కు పంపించాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు అభ్యర్థన పెట్టుకుంది.
జూనియర్ల కింద పనిచేసే పరిస్థితి..
గతంలో వీఆర్వోలుగా పనిచేసిన సమయంలో వీరి కింద విధులు నిర్వర్తించిన కొందరు డబుల్ ప్రమోషన్లతో సీనియర్ అసిస్టెంట్లు, ఆర్‌ఐలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడేళ్లు ఇతర శాఖల్లో పనిచేసి సర్వీస్ నష్టపోయి తిరిగి జీపీఓలుగా వారికింద పని చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీనియార్టీకి దక్కని ప్రాధాన్యం..
గతంలో విద్యార్హత అంతగా లేకపోయినా.. ఏళ్లుగా రెవెన్యూశాఖలో పనిచేసి అనుభవం ఉన్నవారిని గత ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారిని తిరిగి రెవెన్యూశాఖలోకి తీసుకునేందుకు విద్యార్హత లేదనే సాకు చూపిస్తూ పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో ఎంతో అనుభవం ఉన్నా సొంత గూటికి చేరుకునే అవకాశం లేకుండా పోయింది.
నేడు విధుల్లో చేరనున్న జీపీఓలు..
సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జీపీఓలకు ఓపెన్ కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా పరిపాలన అధికారులు సాంకేతిక కారణాలతో లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదు. పీహెచ్‌సీ, స్పౌస్ కేటగిరీల విషయమై ధ్రువపత్రాల పరిశీలన ఆలస్యం కావడంతో బుధవారం ఆర్డర్ కాపీలు అందజేయనుంది. వారు వెంటనే కేటాయించిన గ్రామాల్లో జాయినింగ్ రిపోర్టులు ఇచ్చే అవకాశం ఉంది.
ఇతర నియోజకవర్గాల్లో విధుల కేటాయింపుతో నిరాశ
నేడు జాయినింగ్ రిపోర్టులు అందుకోనున్న 92 మంది
ప్రభుత్వ నిబంధనల మేరకే..
ప్రభుత్వ నిబంధనల మేరకే జీపీఓలకు గ్రామా లు కేటాయించాం. గ్రామ స్థాయి ఉద్యోగులకు సొంత నియోజకవర్గంలో పని చేసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వలేదో తెలియదు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించి గ్రామాలు కేటాయించాం.
– భానుప్రకాష్, ఏఓ, కలెక్టరేట్

అయోమయంలో జీపీఓలు!

అయోమయంలో జీపీఓలు!