అన్నదాతల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆగ్రహం

Sep 9 2025 12:56 PM | Updated on Sep 9 2025 12:56 PM

అన్నదాతల ఆగ్రహం

అన్నదాతల ఆగ్రహం

ఖిల్లాఘనపురం: యూరియా దొరక్కపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోమవారం మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం వద్ద మూడురోజుల కిందట యూరియా పంపిణీ చేశారు. సోమవారం కార్యాలయం వద్ద ఎదురుచూసిన రైతులకు యూరియా రాదని తెలియడంతో నేరుగా వనపర్తి–మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. యూరియా ఇచ్చేదాక కదిలేది లేదని.. యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, తహసీల్దార్‌ సుగుణ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రోజుల తరబడి తిరుగుతున్నా రెండు బస్తాల యూరియా ఇవ్వడం లేదని.. బడా నాయకులను వందల సంచులు ఎలా వెళ్తుందని అధికారులను నిలదీశారు. మండలానికి ఎంత వచ్చిందో చెప్పాలని, వెంటనే తీసుకొచ్చి పంపిణీ చేయాలని పట్టుబట్టారు. సాయంత్రం వరకు యూరియా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని, దయచేసి సహకరించాలని ఏఓ కోరారు. అప్పటి వరకు రైతువేదిక దగ్గర టోకన్లు పంపిణీ చేస్తామన్నారు. దీంతో రైతులు ఆందోళన విరమించి రైతువేదిక దగ్గరకు వెళ్లారు.

రైతుల పడిగాపులు..

ఆత్మకూర్‌: స్థానిక పీఏసీఎస్‌ వద్ద సోమవారం తెల్లవారుజాము నుంచే వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం చెప్పులు, పట్టాదారు పాసు పుస్తకాలను వరుసలో పెట్టి పడిగాపులు పడ్డారు. మధ్యాహ్నం 300 సంచులు రాగా పోలీసులు కలుగజేసుకొని రైతులను వరుసలో నిల్చోబెట్టి 150 మందికి పంపిణీ చేశారు. మిగిలిన 213 మంది రైతులకు టోకెన్లు అందించామని మంగళవారం సరఫరా చేస్తామని ఏఓ వినయ్‌కుమార్‌, సీఈఓ నరేష్‌ తెలిపారు.

పాన్‌గల్‌లో అదే రద్దీ..

పాన్‌గల్‌: మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయానికి సోమవారం 300 బస్తాల యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కార్యాలయ ఆవరణ రైతులతో కిక్కిరిసిపోయింది. రెండ్రోజుల కిందట ఇచ్చిన టోకన్లు 816 ఉండగా వారికి పంపిణీ చేశారు. వారిలో ఇంకా 516 మంది మిగిలిపోగా.. కొత్తగా 400 వరకు టోకన్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

మదనాపురంలో ధర్నా..

మదనాపురం: మండల కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం వద్ద సోమవారం రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కృష్ణయ్య యాదవ్‌ మాట్లాడుతూ.. యూరియా కోసం ఒక్కో రైతు 15 రోజుల తరబడి దుకాణాల చుట్టూ తిప్పుకోవడం సరైంది కాదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ రైతులను మభ్యపెట్టడం మంచి పద్ధతి కాదని, వెంటనే సరిపడా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ జేకే మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బిట్లు యాదగిరి, మాజీ మండల కో–ఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా, మాజీ సర్పంచ్‌లు విజయేందర్‌రెడ్డి, అనిమోని మాసన్న యాదవ్‌, కురుమూర్తి, శివశంకర్‌, శ్రీనివాసులు, రాజ్‌కుమార్‌, ఆవుల బాలు, మాజీ మార్కెట్‌ డైరెక్టర్లు దేశి వెంకటేష్‌ యాదవ్‌, నక్క సత్యం పాల్గొన్నారు.

యూరియా ఇవ్వాలంటూ

ఖిల్లాఘనపురంలో రాస్తారోకో చేసిన రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement