
పోలీసులపై ప్రజలకు పెరిగిన విశ్వసనీయత
వనపర్తి: పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌లో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తామని రాష్ట్ర పోలీస్ హౌజింగ్‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్, ఐజీ రమేష్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని రాజపేట శివారులో వనపర్తి పోలీస్‌శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్‌బంక్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై విశ్వసనీయత పెరిగిందన్నారు. జిల్లాలో పోలీస్ విభాగం ద్వారా పెట్రోల్‌బంకు ఏర్పాటుకు ప్రతిపాదిస్తే కలెక్టర్, ఎమ్మెల్యే వేగంగా స్పందించి తక్కువ కాలంలో అనుమతులు ఇవ్వడంతో 4 నెలల వ్యవధిలో పూర్తి చేసినట్లు వివరించారు. భవిష్యత్‌లో బైపాస్ రోడ్, మదనాపురం రైల్వేస్టేషన్ నుంచి జిల్లాకేంద్రానికి నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తే వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. పెట్రోల్‌బంక్ నిర్వహణలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజల ఆదరణ మరింత పొందుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్‌లో దేశంలోనే తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో ఉండటం గర్వకారణమన్నారు.
వనపర్తి–కొత్తకోట కారిడార్‌కు ప్రతిపాదనలు..
వనపర్తి – కొత్తకోట కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆర్‌అండ్‌బీ మంత్రికి అందజేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. దీంతోపాటు వనపర్తికి ఒక బైపాస్ రోడ్డు పెబ్బేరును అనుసంధానిస్తూ ప్రతిపాదించామని.. అది కూడా మంజూరైందని త్వరలోనే పనులు చేపడతామన్నారు. అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఎస్పీ రావుల గిరిధర్ ప్రత్యేక చొరవతోనే తక్కువ కాలంలోనే పెట్రోల్‌బంక్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఎస్పీతో పాటు సిబ్బందిని అభినందించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే పెట్రోల్ బంకులను త్వరగా పూర్తిచేయాలని ఐఓసీఎల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఐఓసీఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావు, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, వివిధ పోలీస్‌స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
పెట్రోల్‌బంక్ ప్రారంభోత్సవంలో
ఐజీ రమేష్‌రెడ్డి