
తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం
వనపర్తి: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు సహకరించాలని ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల జిల్లాస్థాయి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 6వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా రూపొందించి అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. 8వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు అవకాశం కల్పించామని.. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, లొకేషన్‌లలో అభ్యంతరాలుంటే తెలుపాలని సూచించారు. 9వ తేదీన ఫిర్యాదులు పరిష్కరించి 10వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటిస్తామని వివరించారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 3,82,295 మంది ఓటర్లుండగా.. అందులో పురుషులు 1,90,068 మంది, మహిళలు 1,92,223 మంది, ఇతరులు నలుగురు ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 133 మంది ఎంపీటీసీలు, 15 మంది జెడ్పీటీసీలను ఎన్నుకుంటారని.. ఇందుకోసం 268 గ్రామపంచాయతీలు, 2,436 వార్డులు, 283 లొకేషన్లలో 657 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపించామని మొదటి విడతలో వనపర్తి నియోజకవర్గంలోని 8 మండలాలు, రెండో విడతలో మిగిలిన 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఆర్డీఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ముసాయిదా ఓటరు జాబితాలో 1,370 మందికి రెండుచోట్ల ఓటు హక్కు, 800 వరకు మృతిచెందిన వారి పేర్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎన్నికల్లోపు వారి పేర్లు తొలగించి ఓటరు జాబితా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమకు ముందుగానే ఓటరు జాబితా ఇవ్వాలని, సమావేశం మినిట్స్ కాపీని అందజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. సమావేశంలో జెడ్పీ సూపరింటెండెంట్ నాగేశ్వర్‌రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గట్టుయాదవ్, బీజేపీ నుంచి డి.నారాయణ, సీపీఐ (ఎం) నుంచి ఎండీ జబ్బార్, ఎంఐఎం నుంచి ఎండీ రహీం పాల్గొన్నారు.