
అడవుల్లో అసైన్డ్ స్థలాలను గుర్తించాలి
వనపర్తి: జిల్లాలోని అటవీ భూమిలో ప్రభుత్వం ద్వారా ఏమైనా అసైన్డ్ చేసి ఉంటే గుర్తించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ప్రత్యేక విచారణ కమిటీతో సమావేశమై మాట్లాడారు. అటవీ భూమిలో ఎలాంటి నిర్మాణాలుగాని, ఇతరులకు అప్పగించడానికి వీలు లేదన్నారు. ఎక్కడైనా పొరపాటున అసైన్డ్ చేసి ఉంటే ఆ భూమిని సర్వేనంబరుతో గుర్తించడానికి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో అటవీశాఖ అధికారి, ఆర్డీఓ, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత తహసీల్దార్ ఉంటారన్నారు. జిల్లా అటవీ అధికారి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ భూమి కొన్నచోట్ల తక్కువ, మరికొన్ని చోట్ల ఎక్కువ చూపిస్తున్నారని, సర్వే చేసి ఉండాల్సిన భూమి గుర్తించి ఇవ్వాల్సిందిగా కోరారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ, ఆర్‌అండ్‌బీ డి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి..
ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి పాల్గొని ఫిర్యాదుదారులతో అర్జీలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. అర్జీదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు 44 వినతులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.