
బాధ్యతతో మెలిగితే ఉత్తమ సమాజం
వనపర్తిటౌన్: నేరానికి శిక్ష తప్పదనే నిజాన్ని గ్రహించి బాధ్యతతో మెలగాలని.. అప్పడే సమాజంలో నేరాలు తగ్గి ఉత్తమ సమాజం రూపుదిద్దుకుంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సీవీ రామన్ టాలెంట్ స్కూల్‌లో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే సమాజం తెలుస్తుందని, ఏ తప్పునకు ఏ శిక్ష పడుతుందో తెలుసుకుంటే ఎవరూ ఎలాంటి తప్పిదాలు చేసేందుకు ధైర్యం చేయరన్నారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మోటారు వాహనాల చట్టం, ఉచిత నిర్బంధ విద్య, పోక్సో యాక్ట్ గురించి వివరించారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, కరస్పాండెంట్ డా. మురళీధర్, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, స్కూల్ అడ్వైజర్ సత్తార్, ప్రిన్సిపాల్ షబానా పాల్గొన్నారు.