
సీఎంఆర్ అప్పగించకుంటే కఠిన చర్యలు
● బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వని మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్ట్ అమలు చేయాలి
● సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి: సీఎంఆర్ బకాయిలు అప్పగించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అవసరమైతే ఆర్‌ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ యాక్టు) అమలు చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సీఎంఆర్ బకాయిలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఎంత వరి ధాన్యం సేకరించారు? మిల్లర్ల వారీగా రావాల్సిన సీఎంఆర్ బకాయిలు, ధాన్యం సేకరణ, బకాయిదారులపై తీసుకున్న చర్యలు.. ధాన్యం నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 180 రైస్‌మిల్లులు ఉండగా అందులో 168 రా రైస్ మిల్లులు, 12 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయని, 29 మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు, ఐదుగురు మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్టు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్ల నుంచి సీఎంఆర్ బకాయిలు రావాల్సి ఉందని డీఎం వివరించారు. సీఎంఆర్ బకాయిలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని.. అప్పగించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వలు లేకుంటే కేసులు నమోదు చేయాలని.. సీఎంఆర్ అప్పగించకుంటే ఆర్‌ఆర్ యాక్ట్ కింద ఆస్తులు జప్తు చేయాలని సూచించారు. మిల్లర్లు అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై ఆరా తీశారు. సీఎంఆర్ బకాయిల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ కాశీ విశ్వనాథం, జిల్లా మేనేజర్ జగన్మోహన్, అసిస్టెంట్ మేనేజర్ బాలూనాయక్, సీఐ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.