
ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మిస్తాం
మదనాపురం: ఊకచెట్టు వాగుపై వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టామని.. త్వరలోనే భూమిపూజ చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని అజ్జకొల్లులో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. మండల కేంద్రం నుంచి అజ్జకొల్లు వరకు రెండు వరుసల బీటీరోడ్డు నిర్మాణం చేపట్టి ఆర్టీసీ బస్సు నడిపించే బాధ్యత తనదేనన్నారు. అలాగే నూతన పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన స్వయంగా పరిశీలించి పురోగతిని అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. తిరుమలాయపల్లిలో ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చెర్మన్ పల్లెపాగ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, కృష్ణవర్ధన్‌రెడ్డి, సాయిబాబా, మాజీ సర్పంచ్ సత్యం, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.