
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
వనపర్తి: శాంతిభద్రతల పరిరక్షణ దష్ట్యా జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు యాక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని సూచించారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారితీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమన్నారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలు, రాజకీయ నాయకుల, కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజావాణికి 6 ఫిర్యాదులు
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆరుగురు ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల సీఐ, ఎస్‌ఐలకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమే యం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకునేలా వారికి భరోసా కల్పించాలని సూచించారు.