
గిరిజన రైతులపై కేసులు ఎత్తివేయాలి
పాన్‌గల్: గిరిజన రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కిష్టాపూర్‌తండాలో పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, వారిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ వివిధ రూపాల్లో గిరిజన రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఎం బృందం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కిష్టాపూర్‌తండాలో సర్వే నెం.34లో 12 ఎకరాల భూమిని 25 మంది గిరిజన రైతులు 70 ఏళ్లుగా సాగు చేస్తున్నారన్నారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులపై అకారణంగా అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేయించారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తండాను సందర్శించి సమగ్ర విచారణ జరిపి గిరిజన రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. బా ల్యనాయక్, వెంకటయ్య, వేణుగోపాల్, ఎం.వెంకటయ్య, చంద్రశేఖర్, కోదండరాములు, నిరంజన్, కృష్ణయ్య, గిరిజన రైతులు పాల్గొన్నారు.