
మరో ఆరు నెలలు..
చివరిసారిగా..
చేనేత సహకార పాలకవర్గాల గడువు పొడిగింపు
● 2013లో జరిగిన ఎన్నికలే చివరవి..
● చతికిల పడుతున్న సొసైటీలు
● పేరుకే బాధ్యతలంటున్న అధ్యక్షులు
●
అమరచింత: చేనేత, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పదవీకాలం మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటికి సంబంధించిన జీఓలను ఆయా సొసైటీలకు చేనేత, జౌళిశాఖ అధికారులు పంపించారు. దీంతో చేనేత సహకార సంఘాల ఎన్నికల తంతు మరో ఆరునెలల పాటు అటకెక్కినట్లయింది. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధ్యక్షులు తమను నామ్‌కే వాస్తేగా నియమిస్తున్నారే తప్పా నిధులు, విధులు లేవంటున్నారు. చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాత పాలకవర్గాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం చేతులు దుపులుకొంటుంది. ఇప్పటికే 15 పర్యాయాలు పాత పాలకమండలికే బాధ్యతలు అప్పగించిన జౌళీశాఖ అధికారులు మరో 6 నెలల పాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేతన్నలు సైతం ఎన్నికలకు సంసిద్ధంగా ఉన్నారా లేదా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలను పొడిగిస్తూ వచ్చిందని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిర్వహించి సొసైటీల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆశపడిన నేతన్నలకు నిరాశే మిగిలింది.
తూతూమంతరంగా..
పదవి కాలం పొడిస్తున్నా.. తగిన నిధులు లేని కారణంగా సొసైటీల నిర్వహణ తూతూమంత్రంగా కొనసాగుతోంది. అధ్యక్షుడికి నామమాత్రపు అధికారం ఉండటంతో సొసైటీ ద్వారా అందే పథకాల, కొత్త సభ్యుల చేరికలు వంటి కార్యక్రమాలు జౌళిశాఖ అధికారుల కనుసన్నల్లో కొనసాగుతున్నాయని ఆయా సంఘాల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల సాధారణ సమావేశంతో పాటు సభ్యుల సమావేశాల సమయంలో కనీస ఖర్చులు, స్వీపర్ల వేతనాలకు సైతం నిధులు లేని దుస్థితి నెలకొందని చెబుతున్నారు.
నాగర్‌కర్నూల్ 3
చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు చివరిసారి 2013, ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. ఆయా పాలకవర్గాల గడువు 2018, ఫిబ్రవరి 10 నాటికి ముగిశాయి. అప్పటి నుంచి ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. గతంలో ఉన్న పాలకవర్గాలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున ఇప్పటి వరకు 16 దఫాలు బాధ్యతలు అప్పగించడంతో పాటు ప ర్సన్–ఇన్– చార్జిలతో కాలం నెట్టుకొస్తున్నారు.