
బీఆర్‌ఎస్ పాలనలోనే నీటికుంటల ఆధునికీకరణ
వనపర్తి రూరల్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటలను ఆధునికీకరించి చెరువులను తలపించేలా పునర్నిర్మించామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దగూడెంతండా, తిరుమలయ్యగుట్ట అటవీ ప్రాంతంలో గత ప్రభుత్వం నిర్మించిన తిరుమలయ్యకుంట, దీద్యాకుంటను రైతులతో కలిసి ట్రాక్టర్‌పై వెళ్లి సందర్శించారు. నీటితో కళకళలాడుతున్న ఆయా కుంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో చెక్‌డ్యామ్‌లు, కుంటలు నిర్మించి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టామని, ఈ ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న 32 మంది రైతులకు పట్టాలిచ్చామని.. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మిగిలిన వారికి కూడా పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, మాణిక్యం, రవిప్రకాష్‌రెడ్డి, మాధవరెడ్డి, నరేష్, మహేశ్వర్‌రెడ్డి, ధర్మానాయక్, ఏర్వ సాయిప్రసాద్, కొండన్న, టీక్యానాయక్, చత్రూనాయక్, నారాయణనాయక్, నాగరా జు, అంజినాయుడు, బాబునాయక్, రవినాయక్ తదితరలు పాల్గొన్నారు.
నిర్ణీత రోజుల్లో
నిమజ్జనం చేయాలి
వనపర్తి: గణేష్ ఉత్సవ సమితి వారు వేద పండితులను సంప్రదించి మంచిరోజులైన 6వ రోజు లేదా 10వ రోజు మాత్రమే నిమజ్జనం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శోభాయాత్రను సాంస్కృతిక కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఉత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా అనేక మండపాలు ఏర్పాటుచేసి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజించారని.. అలాగే చివరి ఘట్టం నిమజ్జనం కూడా సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ సమైఖ్యతను చాటి చెప్పేలా ముగించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శోభాయాత్రను సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించాలని.. అతి ధ్వనులైన డీజే సౌండ్స్ ఉపయోగించకుండా ఆకతాయి చేష్టలు లేకుండా భజనలు, డోలు సన్నాయిలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ సాగాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా పూర్తి చేయాలని పేర్కొన్నారు.