
యూరియాకు తప్పని పాట్లు
● చెప్పుల వరుసలు.. రైతుల బారులు
● అందని వారికి టోకన్ల జారీ
అమరచింత: యూరియా కోసం మండల రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు రెండ్రోజులకు ఓసారి మండలంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేసిన అధికారులు శనివారం పీఏసీఎస్ ద్వారా పంపిణీ చేశారు. మస్తీపురం క్రాస్‌రోడ్‌లోని ప్రైవేట్ గోదాం వద్ద యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించడంతో వేకువజామునే అక్కడకు చేరుకున్నారు. చెప్పులను వరుసలో పెట్టి అధికారుల రాక కోసం ఎదురు చూడటం కనిపించింది. సీఈఓ నరేష్ వచ్చి వరుసలో ఉన్న చెప్పుల ప్రకారం టోకన్లు ఇచ్చి సరఫరా చేశారు. మొత్తం 300 బస్తాలను సాయంత్రం 4 వరకు పంపిణీ చేశారు.
● మండలంలోని చంద్రగడ్‌కు చెందిన మహిళా రైతు పార్వతమ్మ తీవ్ర జ్వరంతో క్యూలైన్‌లో నిలుచుంది. సైలెన్ ఎక్కించుకొని నేరుగా రావడంతో నిరసంగా కనిపించగా ఆమె బాధను గుర్తించిన రైతులు ముందుగా ఆమెకు అందించమని అధికారులకు సిఫారస్ చేశారు. వృద్ధులు చాలా సమయం నిల్చోలేక అక్కడే నేలపై కూర్చొని కునుకు తీయడం కనిపించింది.