
వానాకాలం వరి కొనుగోళ్లకు ప్రణాళికలు
● రెవెన్యూ అదనపు కలెక్టర్
ఎన్.ఖీమ్యానాయక్
వనపర్తి: జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా ద్వారా 414 కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. సన్న, దొడ్డు రకం కలిపి 4.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కనీస మద్దతు ధర క్వింటాకు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, కామన్ రకం రూ.2,369గా నిర్ణయించిందని తెలిపారు. పంట కోతలు ప్రారంభమయ్యే నాటికి కొనుగోలు చేసేలా అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు.
పీపీసీ ఇన్‌చార్జీలకు కమీషన్ విడుదల..
2023–24 వానాకాలానికి సంబంధించి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేసిన పీపీసీ ఇన్‌చార్జ్‌లకు క్వింటాకు రూ.32 చొప్పున రూ.6.06 కోట్లు, అదే ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించి రూ.2.79 కోట్ల కమీషన్ మంజూరైనట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్కులను పౌరసరఫరాలశాఖ డీఎం, పౌరసరఫరాల అధికారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు అందజేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాల డీఎం జగన్మోహన్, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ ఆంజనేయులుగౌడ్, డీసీఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.