
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరపాలి
వనపర్తి: గణేష్ నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షేర్ బ్యాండ్, సన్నాయి, డిల్లెం బల్లెం, కోలాటం, చెక్కభజన, పండరి భజన, నృత్య ప్రదర్శనలతో శబ్ద కాలుష్యాన్ని నివారిస్తూ శోభాయాత్రలు జరపాలని, దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. డీజేల నుంచి అధిక డెసిబుల్స్‌తో ఉత్పన్నమయ్యే శబ్ధాలతో హృద్రోగులు, చిన్నారుల ప్రాణాలకు ప్రమాదమని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయన్నారు. జిల్లా పరిధిలో డీజే సౌండ్ మిక్సర్లు, ఆంప్లిఫయర్, బాణాసంచా వినియోగాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శోభాయాత్రను సాయంత్రం 4 వరకు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మంచారి, రవి యాదవ్, చీర్లచందర్, లక్కాకుల సతీష్, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.