
రైతులు వదంతులు నమ్మొద్దు
పాన్‌గల్: మండలంలో యూరియా కొరత లేదని.. రైతులు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయాన్ని ఆయన సందర్శించి యూరియా సరఫరాపై అధికారులతో ఆరా తీశారు. అలాగే వచ్చిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. యూరియా కొరత ఉందనే వదంతులతో రైతులు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు చేరుకుంటున్నారన్నారు. మండలంలోని సింగిల్‌విండో కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు 13,500 బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రోజుకు 750 బస్తాల చొప్పున రైతులకు అందిస్తున్నామని తెలిపారు. పంపిణీ చేసే యూరియా పక్కదారి పట్టకుండా వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో బయోమెట్రిక్ విధానం ద్వారా ఎకరాకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని.. వారికి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మేరకు యూరియా అందిస్తామన్నారు. ఆయన వెంట కార్యాలయం సిబ్బంది ఉన్నారు.