వనపర్తి రూరల్: పోలీస్ పెట్రోల్ బంక్ నిర్మాణంలో నాణ్యత పాటించాలని.. రాజీ పడొద్దని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ కాంట్రాక్టర్‌కు సూచించారు. మండలంలోని రాజాపేట శివారు గాయత్రి పాలిటెక్నిక్ కళాశాల పక్కన నూతనంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినియోగంలోకి వస్తే వినియోగదారులకు నాణ్యమైన ఇందనం అందుతుందని, పోలీస్‌శాఖ పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. ఆయన వెంట ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సైట్ ఇంజినీర్ నరేష్, ఏఆర్ ఎస్‌ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి పేదలకు వరం : ఎమ్మెల్యే
కొత్తకోట రూరల్/గోపాల్‌పేట: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెద్దమందడిలోని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో 35 మందికి, గోపాల్‌పేటలో 52 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పెద్దమందడిలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటస్వామి, తిరుపతిరెడ్డి, టైలర్ రవి, గోపాల్‌పేటలో జరిగిన ఉమ్మడి మండలాల ఇన్‌చార్జ్ సత్యశిలారెడ్డి, రేవల్లి మండల అధ్యక్షుడు పర్వతాలు పాల్గొన్నారు.
‘1న కలెక్టరేట్ ముట్టడి’
వనపర్తిటౌన్: స్థానిక సమస్యల పరిష్కారానికిగాను సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ తెలిపారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన పదాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు హేమారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్దిరాజు, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కల్పన, బండారు కుమారస్వామి, బాశెట్టి శ్రీను, శివారెడ్డి, రాఘవేందర్, గోర్ల బాబురావు పాల్గొన్నారు.