
తప్పులు లేని ఓటరు జాబితా రూపొందిద్దాం
వనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకుగాను తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం గ్రామపంచాయతీల వారీగా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల జిల్లాస్థాయి ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీలో ముసాయిదా ఓటరు జాబితా, వార్డుల వివరాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రదర్శించామని, క్షుణ్ణంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలుంటే మండల అభివృద్ధి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలన్నారు. శనివారం మండలస్థాయిలో సైతం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని చెప్పారు. మరణించిన వారి పేర్లు సైతం జాబితాలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని పలువురు తెలిపారు. స్పందించిన కలెక్టర్ గుర్తించిన పేర్లను ఎంపీడీఓలకు ఇవ్వాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీపీఓ రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి