
పరిసరాల శుభ్రతతో వ్యాధులు దూరం
కొత్తకోట రూరల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రోగాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం మండలంలోని రామనంతాపూర్‌లో నిర్వహించిన ఫ్రై డే – డ్రై డే కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పరిసరాల శుభ్రతపై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని, పాత టైర్లు, మరేమైన పాత వస్తువులుంటే తీసివేయాలని, వాటితో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. మురుగు కాల్వలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా గ్రామంలో ఓ చిన్నారి డెంగీ బారినపడగా వారి ఇంటికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. పాప ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్టులు చూశారు. ఇతరులకు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు
వేగవంతం చేయాలి..
గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ ప్రక్రియ దశల వారీగా పూర్తి చేసిన వెంటనే ఫొటోలను అప్‌లోడ్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇంకా పనులు ప్రారంభించని లబ్ధిదారులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, ప్రాజెక్టు అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, హౌసింగ్ అధికారి విఠోభా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.