
కొరవడిన పర్యవేక్షణ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హతకు మించిన వైద్యం
●
విచారణ చేపడతాం..
పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెలకొన్న వివాదంపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసే వైద్యులు ఎందరు పని చేస్తున్నారు.. ఎవరు సర్జరీ చేశారు.. విద్యార్హత ఏమిటని విచారణ చేస్తాం. శుక్రవారం కలెక్టర్ వెంట పర్యటనలో ఉండటంతో పెబ్బేరుకు వెళ్లలేకపోయాం.
– డా. శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి
రాజీకి రూ.లక్షలు..?
పోలీసులు, స్థానిక పెద్దలు పలువురు సదరు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి రూ.మూడు లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చడంతో ఆందోళన సద్దుమణిగినట్లు స్థానికంగా చర్చ వినిపిస్తోంది. మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపడుతున్న సమయంలో ఆస్పత్రిలోని ఎవరినీ రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తూ యాజమాన్యానికి రక్షణ కల్పించారు. అనంతరం ఆస్పత్రిలో చాలా సమయం చర్చలు జరిపి కాసులకు రాజీ కుదిర్చినట్లు ప్రచారం సాగుతోంది.
వనపర్తి: జిల్లాలో ఆర్‌ఎంపీలు, ఎంబీబీఎస్ వైద్యులు అర్హతకు మించి వైద్యం చేస్తూ.. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. శుక్రవారం పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడు అర్హతకు మించిన వైద్యం చేయడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. వైద్యశాఖ అధికారులు కనీసం పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించకపోవడం శోచనీయం. జిల్లావ్యాప్తంగా ఆర్‌ఎంపీలు సైతం ప్రథమ చికిత్సకు బదులు రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా నర్సింగ్ హోంలు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు విస్త్రృతంగా దాడులు చేసి పలు కేంద్రాలను సీజ్ చేశారు. స్థానిక అధికార పార్టీ నేతలు అధికారులపై ఎదురుదాడికి దిగి ఎలాంటి చర్యలు లేకుండానే ఆయా కేంద్రాలు పునః ప్రారంభించుకునేలా చేయడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వైద్యులు అక్రమార్జన కోసం ఇష్టానుసారంగా అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నారు.
ఇదెక్కడి చోద్యం..
వైద్యవృత్తి ఎంతో పవిత్రమైంది. కాసుల కోసం అర్హతకు మించిన వైద్యం చేసిన ఘటన తాజాగా పెబ్బేరులో వెలుగు చూసింది. ఐదురోజుల కిందట ఓ వ్యక్తి మెడభాగంలో ఏర్పడిన కణతిని ఎంబీబీఎస్ వైద్యుడు తొలగించారు. ఈ శస్త్రచికిత్సలో అతడి మెదడుకు రక్తం సరఫరా అయ్యే నాళం కట్ కావడంతో మెదడులో రక్తం పేరుకుపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి.. అటు నుంచి హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సదరు వైద్యుడు సరైన వైద్యం అందించని కారణంగానే మృతి చెందాడంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగగా పోలీసులు జోక్యం చేసుకొని సమస్యను సద్దుమణిగించినట్లు సమాచారం.
కాసుల కోసం
ప్రాణాలతో చెలగాటం?
పెబ్బేరులో కణతి తొలగించిన
ఎంబీబీఎస్ వైద్యుడు..
ఐదురోజుల తర్వాత వ్యక్తి మృతి
ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన
పోలీసుల జోక్యంతో
సద్దుమణిగిన వివాదం