
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
వనపర్తి రూరల్: రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులు సరఫరా చేయాలని.. ప్రతి డీలర్ సరిపడా యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్ సూచించారు. శుక్రవారం నాగవరం శివారులోని రైతువేదికలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతుసేవ కేంద్రాలు, ఎరువుల డీలర్ల శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి దుకాణంలో 20 టన్నుల కన్నా ఎక్కువ ఎరువులు నిల్వ చేయాలని.. వివరాలను దుకాణంలో రైతులకు కనబడేలా ప్రదర్శించాలని సూచించారు. అనంతరం మండలాల వారీగా ఎరువుల నిల్వల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.