
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : ఎస్పీ
పాన్‌గల్: మండలంలోని రేమద్దులకు చెందిన కానిస్టేబుల్ తలారి శివకుమార్ (43) కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటూ ఆదుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. రేవల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న తలారి శివకుమార్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. శుక్రవారం ఎస్పీతో పాటు డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ కృష్ణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, ఎస్‌ఐలు గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంత్యక్రియల ఖర్చులకు రూ.30 వేలు బాధిత కుటుంబానికి అందజేశారు. భార్య సుజాత, కుమార్తెలు రష్మిత, అర్పిత, కుమారుడు హిమాన్షును ఎస్పీ ఓదార్చి మాట్లాడారు. శివకుమార్ నిజాయితీగా విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారని గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో రేవల్లి, పాన్‌గల్, పెద్దమందడి ఎస్‌ఐలు రజిత, శ్రీనివాసులు, శివకుమార్, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
నేడు జాన్‌వెస్లీ రాక
అమరచింత: మండల కేంద్రంలో శనివారం జరిగే సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరతున్నారని పార్టీ మండల కార్యదర్శి జీఎస్ గోపి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి పోరాటం చేసే విధంగా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సీపీఎం నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొ ని విజయవంతం చేయాలని కోరారు.
జూరాల కాల్వలో
జమ్ము తొలగింపు
వీపనగండ్ల: మండలంలోని తూంకుంట సమీపంలో ఉన్న జూరాల సాగునీటి కాల్వలో జమ్ము, సిల్ట్ తొలగింపు పనులను శుక్రవారం అధికారులు, రైతులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు ప్రారంభించారు. చిన్నంబావి మండలంలోని డి–36 నుంచి కొండూరు వరకు ఉన్న డి–40 వరకు 23 కిలోమీటర్ల కాల్వలోని జమ్ము, సిల్ట్‌ను తొలగించనున్నట్లు జూరాల ఇరిగేషన్ జూనియర్ ఇంజినీర్ నాగేంద్రం తెలిపారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో అత్యవసరంగా పనులు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు కొండూరు గోపాల్, తూంకుంట గ్రామ నాయకులు పెద్ద రాంబాబు, తిరుపతయ్య, రాజశేఖర్ తెలిపారు.
‘పార్టీ బలోపేతమే
లక్ష్యంగా పనిచేయాలి’
పాన్‌గల్: కొత్త కార్యవర్గాలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడిగా ఎన్నికై న వీరసాగర్ శుక్రవారం నాయకులతో కలిసి మాజీ మంత్రిని ఆయన స్వగృహంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకుసాగాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌నాయక్, చిట్యాల రాము, నాయకులు సుధాకర్‌యాదవ్, రాజేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మిద్దె కృష్ణ, రాంబాబునాయక్, ఎల్లస్వామి, మిద్దెరాజు తదితరులు పాల్గొన్నారు.
మంత్రాలయానికి
బస్సు సౌకర్యం
వనపర్తిటౌన్: వనపర్తి డిపో నుంచి మంత్రాలయానికి ప్రతిరోజు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.20 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.30కి చేరుకుంటుందని.. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు తిరిగి వనపర్తికి బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసు కోవాలని పేర్కొన్నారు.