
కోయిల్‌సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర/ చిన్నచింతకుంట: కోయిల్‌సాగర్‌లో నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 24.6 అడుగులకు చేరింది. జూరాల నుంచి కేవలం ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు పంపులు రన్ చేస్తే 630 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉంది. దీంతో కాల్వల ద్వారా నీటిని వదిలిన ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో బండర్‌పల్లి చెక్‌డ్యాం నుంచి ఆదివారం అలుగు పారింది. చెక్‌డ్యాం వల్ల చుట్టు పక్కల ఉండే గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
రెడ్డి కార్పొరేషన్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన విధంగా పేద రెడ్ల అభ్యున్నతి కోసం రెడ్డి కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రస్థాయిలో నిర్వహించే అన్ని విద్య, ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. తమ సంస్థ ద్వారా చదువులో ముందంజలో ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. అలాగే పలు ప్రమాదాల్లో గాయపడిన పేద రెడ్లకు వైద్య సహాయం కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, సహధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, ప్రచార కార్యదర్శి సురేందర్‌రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘కాలగమనం’
పుస్తకావిష్కరణ
అచ్చంపేట: ప్రముఖ కవి ఎంఏ గఫార్ రచించిన కాలగమనం పుస్తకాన్ని ఆదివారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో తెలంగాణ ప్రముఖ కవి, వక్త, సాహితీవేత్త నాగేశ్వరం శంకరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఏ గఫార్ మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగులో కవిగా రాణించడం గొప్ప విషయమన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో నల్లమల రత్నాలు, ప్రజాప్రస్థానం, మేలుకొలుపు తదితర రచనలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మకట శతకంలో వచన కవిత్వాన్ని రచించడం చాలా అరుదు అని.. అలాంటి వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆయన ముందు వరుసలో ఉంటారన్నారు.