
ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన
పాన్‌గల్/వీపనగండ్ల: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సమస్యల పోరాటానికి ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు పిలుపునిచ్చారు. ఆదివారం పాన్‌గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి, వీపనగండ్ల మండలంలోని బొల్లారంలో పర్యటించి ఈ నెల 23, 24వ తేదీల్లో ఆత్మకూర్‌లో నిర్వహించే జిల్లా మహాసభల జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును తగ పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. కేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి శ్రమజీవుల, పేదల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.
పత్తా లేని 2 కోట్ల ఉద్యోగాలు
బీజేపీ అధికారంలోకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 11 ఏళ్లైనా.. ఆ దిశగా అడుగులు వేయట్లేదని దుయ్యబట్టారు. స్వీస్ బ్యాంక్‌లో ఉన్న నల్లధనాన్ని బయటికి తీసి ప్రతి కుటుంబం ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామన్నా హామీ నీటి మూట మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. మహాసభలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు రమేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష, ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు శ్రీరామ్, బాలస్వామి పాల్గొన్నారు.