
‘రామన్నగట్టు’ పనులు ప్రారంభించాలి
వనపర్తి రూరల్: రామన్నగట్టు రిజర్వాయర్ పనులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండలంలోని ఖాసీంనగర్ ఎర్రగట్టుతండాలో నిర్వహించిన సమావేశంలో ఎం.నర్సింహ, నీలేశ్వర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీకి చెందిన 40 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాసీంనగర్ పరిసర తండాల రైతులు సాగునీటికి పడుతున్న కష్టాలు చూసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి 03.10.2023న రామన్నగట్టు రిజర్వాయర్ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్ పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతుభరోసా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, నాయకులు ధర్మానాయక్, గోపాల్‌నాయక్, రవిప్రకాష్‌రెడ్డి, మాధవరెడ్డి, నరేష్ పాల్గొన్నారు.