
ప్రభుత్వ కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లు
వనపర్తిటౌన్: జిల్లాలోని 6 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లను నియమిస్తూ ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలకు పి.ఆనంద్, పెద్దమందడి కళాశాలకు టి.భీమసేన, పానగల్ కళాశాలకు తిరుమలరావు, శ్రీరంగాపూర్ కళాశాలకు ఈజే మోజెస్, ఆత్మకూర్ కళాశాలకు సైదులు, వీపనగండ్ల కళాశాలకు శివగౌడ్ నియమితులైనట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఆరు కళాశాలలు ఇన్‌చార్జ్‌లతో కొనసాగాయని.. ఇప్పటి నుంచి రెగ్యులర్ ప్రిన్సిపాల్స్‌తో నడవనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ కళాశాలలో ప్రిన్సిపాల్ పోస్ట్ ఖాళీగా లేదని చెప్పారు.
17న జాబ్ మేళా
వనపర్తి: జిల్లా ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో పీఎంకేకే సహకారంతో జిల్లాకేంద్రంలోని పీఎంకేకేలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండి పది, ఐఐటీ, ఏదైనా డిగ్రీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ అనంతరం హైదరాబాద్, వనపర్తి జిల్లాలోని వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని.. ఆసక్తిగల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించిరు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు99485 68830, 91753 05435, 77990 73053 సంప్రదించాలన్నారు.
కేఎల్‌ఐ కాల్వకు
సాగునీరు వదలాలి
పాన్‌గల్: కేఎల్‌ఐ కాల్వకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పార్టీ ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు చంద్రశేఖర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్ సమీపంలోని కేఎల్‌ఐ డి–8 కాల్వను రైతులతో కలిసి వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలం ప్రారంభమై నెలలు గడుస్తోందని, ఓ పక్క సరైన వర్షాలు కురవకపోవడం, మరోపక్క కాల్వల్లో సాగునీరు పారకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వరి నారు పోసుకొని నాట్లు వేసేందుకు సాగునీటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గంలో రైతుల ఇబ్బందులు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అధికారులు స్పందించి వెంటనే కాల్వలకు సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని.. లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వీరసాగర్, ధర్మానాయక్, తిరుపతయ్యయాదవ్, బాలరాజు, శేఖర్, యాదగిరిచారి, దామోదర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్– 2, 4, 6 ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం విడుదల చేశారు. ఈ మేరకు రెగ్యులర్ పరీక్షలకు సంబంధించి సెమిస్టర్–2 బీఏలో 31.45 శాతం, బీకాంలో 36.86, బీఎస్సీ 29.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెమిస్టర్–4 బీఏలో 51.36, బీకాంలో 43.57, బీఎస్సీలో 37.63 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సెమిస్టర్–6 బీఏలో 52.27, బీకాం 54.57, బీఎస్సీ 55.58 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. బ్యాక్‌లాగ్ సెమిస్టర్–5 బీఏలో 52.88 శాతం, బీకాంలో 54.44, బీఎస్సీలో 46.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, శాంతిప్రియ, అనురాధరెడ్డి, అరుంధతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
నీటి విడుదల
మదనాపురం: రామన్‌పాడు జలాశయం నుంచి సోమవారం సాగునీటి సరఫరా కొనసాగుతుందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టులో సముద్ర మట్టానికిపైన 1,019 అడుగుల నీటిమట్టం ఉండగా.. ఎన్టీఆర్ కాల్వకు 873 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 45, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని తరలించినట్లు వివరించారు.

ప్రభుత్వ కళాశాలలకు కొత్త ప్రిన్సిపాళ్లు