
అధికారుల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి..
వనపర్తి: త్వరలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో యూత్ సర్వీస్ కేంద్రం ఏర్పాటు చేసి పది ఆపై విద్యనభ్యసించిన యువతకు 11 రకాల ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిక్షణనిస్తామని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగిన దిశ సమావేశానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో పని చేసినప్పుడే సత్ఫలితాలు పొందవచ్చని సూచించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఓసారి అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సమీక్షిస్తామని తెలిపారు.
ఏటా రూ.80 కోట్ల పైచిలుకు దోచిపెట్టారు..
గత ప్రభుత్వం మత్స్య బీజ క్షేత్రాలను అభివృద్ధి చేయడంలో విఫలమైందని, ఉమ్మడి పాలమూరులో ఉన్న నాలుగు క్షేత్రాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయన్నారు. వాటిని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు మరో 14 కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలిపారు. ఏటా ఆంధ్ర కాంట్రాక్టర్లతో చేప విత్తనాలు కొనుగోలు చేసి తెలంగాణ సంపదను రూ.80 కోట్ల మేర దోచి పెట్టారని మండిపడ్డారు. భవిష్యత్‌లో పాలమూరు జిల్లాలోనే 28 లక్షల చేప విత్తనాల ఉత్పత్తి సామర్థ్యంతో మత్స్యబీజ క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. విజిలెన్స్ కమిటీ పర్యవేక్షణలో నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తామని.. ఇందుకు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిధులు కేటాయించినట్లు వివరించారు.
బాధ్యతగా పనిచేయాలి : ఎంపీ మల్లు రవి
అధికారులు తమ ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఎంపీ మల్లు రవి సూచించారు. డోర్నకల్ – గద్వాల రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అలాగే గద్వాల జిల్లా పుల్లూరు నుంచి కొల్లాపూర్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. దిశా సమావేశానికి హాజరుకాని అధికారులు, వచ్చి తిరిగి వెళ్లిన భూగర్భ జల పరిశోధనశాఖ అధికారి, మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, లిఖిత పూర్వక సంజాయిషీ కోరాలని కలెక్టర్‌కు సూచించారు.
జిల్లాకేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్‌తో పాటు 10 మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. నీటి పారుదల, విద్యుత్‌శాఖల అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన ఎనిమిది విద్యుత్ సబ్‌స్టేషన్లకు ఇప్పటి వరకు ఎందుకు టెండర్లు పిలువలేదని అధికారులను ప్రశ్నించారు. సవాయిగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో 500 మీటర్ల కాల్వ తవ్వేందుకు సంబంధిత అధికారులతో అనుమతి తీసుకుంటే ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని.. నీటిపారుదలశాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పాలకులు తెలంగాణ నినాదాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా పాలన చేశారని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికతో పనులు చేపట్టలేదని వివరించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దిశ సమావేశంలో
మంత్రి వాకిటి శ్రీహరి
హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు