
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యమని.. అందుకు అనుగుణంగా మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని మదనాపురం, కొత్తకోటకు సంబంధించిన ఇందిరా మహిళాశక్తి సంబరాలు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే కుటుంబాలు బాగుపడతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ మహిళా సంఘాల ద్వారానే కుట్టిస్తున్నామని, కొత్తకోట మిరాసిపల్లి వద్ద మహిళలతో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులను చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులు హైదరాబాద్‌లో విక్రయించేందుకు శిల్పారామంలో అవకాశం కల్పిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 43 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. ఇందుకుగాను విద్యుత్‌శాఖకు ప్రభుత్వం రూ.1.26 కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం బలోపేతానికి ప్రభుత్వ ఆసుపత్రులు, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అభయ హస్తం పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దేవరకద్రలో రూ.రెండు వేల కోట్లతో బ్రహ్మోస్ క్షిపణి కర్మాగారం, అడ్డాకుల వద్ద డ్రైపోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం..
కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులుగా ఉంటారని.. అందుకే ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలోని మహిళా సంఘాల ఖాతాల్లో రూ.15.5 కోట్ల వడ్డీని జమ చేసినట్లు చెప్పారు. మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకొస్తే రుణాలిచ్చి ప్రోత్సహించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 50 వేల యూనిఫామ్‌లను మహిళా సంఘ సభ్యులతో కుట్టించినట్లు వివరించారు. వరి కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీఆర్డీఓ ఉమాదేవి జిల్లాలో మహిళా సాధికారితకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఐదుగురు ఉత్తమ మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ లేని బ్యాంకు రుణాలు రూ.8.30 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు అందజేశారు. మండల మహిళా సంఘాలకు ప్రమాద, రుణ చెక్కు రూ.2.38 లక్షలు, కొత్తకోట పురపాలికకు సంబంధించి రూ.65,29,903 చెక్కును అందజేశారు. ఆర్టీసీ బస్సు నుంచి వచ్చిన అద్దె రూ.1,38,936 చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, మార్కెట్‌యార్డు డైరెక్టర్ పావని, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మండల సమాఖ్య అధ్యక్షులు చెన్నమ్మ, జయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు నాణ్యమైన విద్య,
మెరుగైన వైద్యం అందిస్తాం
ఎమ్మెల్యే జి.మధుసూధన్‌రెడ్డి