
ఉపాధ్యాయులతో పని చేయించే బాధ్యత హెచ్‌ఎంలదే..
వనపర్తిటౌన్: ఉపాధ్యాయుల్లో కొందరికి అదనపు బాధ్యతలు అప్పగించామని.. అవసరమైనప్పుడు మాత్రమే డీఈఓ కార్యాలయానికి రావాలని డీఈఓ అబ్దుల్ ఘనీ స్పష్టం చేశారు. మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘బడి.. మరిచారు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి బుధవారం కార్యాలయంలో ఏయే విభాగాల్లో ఎవరెవరు ఉన్నారు.. ఎవరు ఏం పని చేస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్యాలయంలో అదనపు బాధ్యతల ఉపాధ్యాయులు లేరని, పాఠశాలలకు అప్పగించామని చెప్పారు. వేతనాలు ఆయా పాఠశాలల నుంచే పొందుతారు కాబట్టి వారితో పని చేయించుకునే బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే అని తేల్చి చెప్పారు. వారు చెప్పినా విధులు నిర్వర్తించకుంటే అసమర్థతే అన్నారు. సీఎంఓగా యుగంధర్‌ను రిలీవ్ చేస్తున్నామని.. కొత్తగా నియమించిన ప్రతాప్‌రెడ్డి గురువారం విధుల్లో చేరుతారని చెప్పారు. బడిబాట కార్యక్రమం కొనసాగుతున్నందున విధుల్లోకి తీసుకోలేదన్నారు. పని లేకుండా కార్యాలయంలో అదనపు బాధ్యతలతో ఎవరు కనిపించినా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రత్యేక అధికారి తనిఖీ
పాన్‌గల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం ఇంటర్‌బోర్డ్ ప్రత్యేక అధికారి విశ్వేశ్వర్ తనిఖీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందంతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధ్యాపక బృందం ఆయనను శాలువాతో సన్మానించింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుమల్‌రావు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

ఉపాధ్యాయులతో పని చేయించే బాధ్యత హెచ్‌ఎంలదే..