
నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక
సాక్షి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో రూ.150 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. జటప్రోల్ సమీపంలో 22 ఎకరాల సువిశాల స్థలంలో యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ సముదాయం నిర్మించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకేచోట ఉండి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్య అభ్యసించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మహిళలకు వడ్డీ లేని రుణాలు..
యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన అనంతరం జటప్రోలులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. బహిరంగ సభకు జనసమీకరణతో పాటు ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలను ముఖ్యమంత్రి చేతులమీదుగా పంపిణీ చేయనున్నారు.
మదనగోపాలస్వామి ఆలయంలో పూజలు..
సీఎం రేవంత్‌రెడ్డి జటప్రోల్‌లోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో మదనగోపాలస్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం కలెక్టర్ సంతోష్ సైతం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
మొదటిసారిగా కొల్లాపూర్‌కు..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రేవంత్‌రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి రానున్నారు. కృష్ణాతీరంలో మారుమూల ప్రాంతంగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధికి ఇతోధికంగా నిధులు మంజూరు చేయనున్నారన్న అంచనాలు నెలకొన్నాయి. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణాతీర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి నిధులు ప్రత్యేకంగా విడుదల చేసే అవకాశాలున్నాయి. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తారని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
మధ్యాహ్నం 1.45 గంటలకు జటప్రోలుకు చేరుకుంటారు.
1.55 గంటలకు జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
2.10 గంటలకు యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
2.20 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జటప్రోలులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
సభలోనే ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తారు.
సాయంత్రం 4.30 గంటలకు
హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.
జటప్రోల్‌లో యంగ్ ఇండియా
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి
శంకుస్థాపన
భారీ బహిరంగ సభలో
ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
ఏర్పాట్లు పూర్తిచేసిన
అధికార యంత్రాంగం

నేడు సీఎం రేవంత్‌రెడ్డి రాక