
ఎత్తిపోతలకు గ్రహణం
●
ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మరమ్మతుల పరంపర
● తరుచుగా సాంకేతిక సమస్యలతో నీటి సరఫరాకు ఆటంకం
● ప్రస్తుతం నెట్టెంపాడులో రెండు, కల్వకుర్తి రెండు, కోయిల్‌సాగర్‌లో ఒక పంపుతోనే తరలింపు
● బకాయిలు చెల్లిస్తేనే పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామంటూ ఏజెన్సీల కొర్రీ
● వరద సమయంలోనే హడావుడి చేస్తున్న వైనం
ఒక్క మోటారుతో కోయిల్‌సాగర్..
మరికల్, ధన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల పరిధిలో రెండు పంటలకు 50 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో కోయిల్‌సాగర్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు ఆది నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. తాజాగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. ఈ క్రమంలో నీటిని ఎత్తిపోయాల్సిన పంపుహౌస్‌లోని రెండు మోటార్లు నిరంతరాయంగా పనిచేస్తే 630 క్యూసెక్కుల చొప్పున 70 రోజులపాటు నడిస్తే 50 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ, రెండు మోటార్లలో ఒకటి సాంకేతిక సమస్యతో ఏడాదిగా పనిచేయడం లేదు. దీంతో ఒక్క మోటారుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారు.
నీటిని పంపింగ్ చేస్తున్నాం..
నెట్టెంపాడు ఎత్తిపోతల స్టేజీ–1, 2లలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వీటిలో ఒకసారి మాత్రమే 6 పంపులతో నీటిని పంపింగ్ చేశాం. మోటార్లలో ఎలాంటి సమస్య లేదు. అయితే పంపుహౌస్‌లో గ్రిడ్‌ను రన్ చేసేందుకు ఎస్‌ఎఫ్‌సీ రన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి రిపేరు వస్తే సరిచేశాం. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నాం. దీనిపై బీహెచ్‌ఈఎల్ వారికి తెలియజేశాం. అయితే ఇతర ప్రాజెక్టులలో వారికి రావాల్సిన బిల్లులు బకాయిలు ఉండడంతో రిపేరు చేసేందుకు రావడం లేదు. ఇప్పటి వరకై తే రూ.2 కోట్ల బకాయిలు చెల్లించాం.
– రహీముద్దీన్, ఎస్‌ఈ ఇరిగేషన్ శాఖ
రెండు పంటలకు నీరివ్వాలి..
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం మోటార్లలో సాంకేతిక సమస్యపై ఇరిగేషన్‌శాఖ మంత్రి, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాను. నీటి పంపింగ్ కోసం అవసరమైన మోటార్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ఈ వానాకాలంలో లక్ష్యం మేర పంపింగ్ చేసుకుని పూర్తిస్థాయిలో ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీరివ్వాలని కోరాను.
– కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల
గద్వాల: పాలమూరు బీడు భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టి వాటి కింద సుమారు 6 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే.. ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు తరచుగా మరమ్మతుకు గురవుతుండటంతో నీటి పంపింగ్‌కు అడ్డంకిగా మారుతోంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం కారణంగా ఎత్తిపోతలకు గ్రహణం పట్టినట్లయింది. నీటిని ఎత్తిపోసే పంపులకు సంబంధించి మోటార్లకు గత కొన్నేళ్లు సరైన మరమ్మతు చేయకపోవడం, మెయింటెనెన్స్ డబ్బులు సంబంధిత కంపెనీలకు చెల్లించకపోవడంతో సరైన నిర్వహణకు నోచుకోకపోవడంతో ఎత్తిపోతల ప్రాజెక్టులకు శాపంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎత్తిపోతల పరిధిలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు రెండో పంటకు సాగునీరు అందించడం ప్రశ్నార్థకంగా మారుతుంది.
రెండు మోటార్లతో నెట్టెంపాడు..
జోగుళాంబ గద్వాల జిల్లావ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో మొత్తం ఏడు మోటార్లను ఏర్పాటు చేశారు. వీటిలో కేవలం రెండు మోటార్లు మాత్రమే పని చేస్తుండగా.. మిగిలిన ఐదు మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. ఈ మోటార్ల మెయింటెనెన్స్ బీహెచ్‌ఈఎల్ నిర్వహిస్తుండగా.. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడంతో మెయింటెనెన్స్ పనులు ఆపేశారు. గతేడాది ఆగస్టులో సైతం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్ద మోటార్లు కాలిపోగా.. నిర్వాహకులు చేతులెత్తెయడంతో అప్పటి సీఈ రఘునాథ్‌రావు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం గుడ్డెందొడ్డి లిఫ్టు వద్దకు చేరుకుని మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్యను బీహెచ్‌ఈఎల్ వారిని ఫోన్ ద్వారా సంప్రదించి మరమ్మతు చేసిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు గాను ర్యాలంపాడు జలాశయం ద్వారా 1.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు.
నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన కేఎల్‌ఐ నేటికీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింద కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5 పంపులు ఏర్పాటు చేయగా.. రెండు పంపులు సాంకేతిక కారణాలతో మూలకు పడ్డాయి. మూడు మోటార్లు ఉన్నా.. రెండింటితోనే నీటి ఎత్తిపోతలు చేపడుతున్నారు.

ఎత్తిపోతలకు గ్రహణం

ఎత్తిపోతలకు గ్రహణం