
ధాన్యం సేకరణలో జాప్యం సరికాదు
వనపర్తి: వచ్చిన వరి ధాన్యం త్వరగా దించుకొని లారీలు తిరిగి పంపించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రైస్‌మిల్లు నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రైస్‌మిల్లర్లతో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నుంచి తూకం చేసి మిల్లుకు చేరిన ధాన్యం లారీలను తాలు, దొడ్డు రకం తదితర కారణాలు చూపుతూ దించుకోకుండా జాప్యం చేస్తుండటంతో లారీలు ఎక్కడికక్కడ నిలిచి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతోందని.. లారీలు మిల్లుల వద్ద నిలుపుకోవడానికి వీలు లేదని హెచ్చరించారు. దొడ్డు రకం ధాన్యం తీసుకోమని చెప్పడం సరికాదని.. సన్న, దొడ్డు రకం 60:40 శాతం మేర కేటాయిస్తున్నందున దించుకోవాల్సిందే అని తేల్చిచెప్పారు. గతేడాది యాసంగిలో జిల్లావ్యాప్తంగా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈసారి మూడింతలు అధికంగా పంట దిగుబడి వచ్చిందని.. ఇప్పటి వరకు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, మరో 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. అందువల్ల రైస్‌మిల్లర్లు సహకరించాలని, రైతులు ఇబ్బంది పడేలా చేయవద్దని కోరారు. అదేవిధంగా కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదని, వెంటనే అందజేయాలని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని మిల్లర్లకు నోటీసులు జారీ చేయాలని పౌరసరఫరాలశాఖ డీఎంను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలశాఖ డీఎం జగన్మోహన్, రైస్‌మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, మిల్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు.
మిల్లర్లు లారీలను త్వరగా ఖాళీచేసి పంపించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి