
స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు నివేదిక అందజేయండి
వనపర్తి: జిల్లాలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం ఏర్పాటుకు స్థల కేటాయింపుపై సమర్థన నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డా. సువర్ణ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి 41వ స్క్రీనింగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఫారెస్ట్ రేంజ్ అధికారి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత స్పోర్ట్స్ స్కూల్, హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదించగా, ఇందులో 12 ఎకరాల ప్రభుత్వ భూమి, మరో 7.166 హెక్టార్ల అటవీ భూమి ఉన్నట్లు పటం ద్వారా తెలుస్తోందన్నారు. అటవీ భూమి కేటాయిస్తే తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. స్పందించిన డా. సువర్ణ 7.166 హెక్టార్ల స్థలం దేని కొరకు కావాలో సమర్థన నివేదిక అందజేయాలని ఫారెస్ట్ రేంజ్ అధికారిని ఆదేశించారు. వీసీలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్‌రెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునే వరకు పోరాటం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ముస్లింలకు వ్యతిరేకంగా బీజేపీ సర్కారు తెచ్చిన వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునేవరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తులను గుంజుకునేందుకు బీజేపీ ఈ బిల్లును తెచ్చిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకమని, అందుకు మద్దతు తెలిపిన టీడీపీకి ఏపీలో ముస్లిం ఓట్లు పడవన్నారు. వేలాది కోట్ల వక్ఫ్ ఆస్తులపై కన్ను వేసిన బీజేపీ సర్కారు వారికి కొల్లగొట్టేందుకు ఈ బిల్లును తెచ్చిందని అందకు సహకరించిన టీడీపీ, జేడీఎస్‌లకు భవిష్యత్‌లో బుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఈనెల 25న స్థానిక బాలుర జూనియర్ కలాశాలలో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు ఎంఐఎం అధినేత ఆసదుద్దీన్‌తో పాటు ఇతర మత పెద్దలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ మైనార్టీ అధ్యక్షుడు మోసిన్, అబ్దుల్ సుల్తాన్, అహ్మద్‌సన, ఇమ్రాన్, ఇద్రీస్, మేరాజ్, హనీజ్, షారుక్, సిద్దిక్, ఇబ్రహీం, నూర్ తదితరులు పాల్గొన్నారు.