
కొనసాగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండోరోజు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 827 మంది విద్యార్థులకుగాను 754 మంది హాజరుకాగా.. 73 మంది గైర్హాజరయ్యారని, అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 74 మంది విద్యార్థులకుగాను 70 మంది హాజరుకాగా.. నలుగురు రాలేదని డీఐఈఓ ఎర్ర అంజయ్య వివరించారు. జిల్లాకేంద్రంలోని జాగృతి, రావూస్, వాగ్దేవి, విజ్ఞాన్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు వివరించారు.
రేపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాక
ఖిల్లాఘనపురం: మండలంలోని కర్నెతండాకు ఆదివారం సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ వస్తున్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. మండలంలోని మామిడిమాడ, షాపురం గ్రామాల రెవెన్యూ శివారుల పరిధిలోని 8 గిరిజన తండాల గిరిజనులు పట్టాల కోసం చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. వెనికితండా, ముందలితండా, బక్కతండా, కర్నెతండా, మేడిబావితండా, ఆముదంబండ తండా, మిట్యాతండాకు చెందిన గిరిజనులు సుమారు 150 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న నాటి రాజుల భూములకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఏళ్ల తరబడి గిరిజనులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలుపుతూ వారికి అండగా పోరాడేందుకు ముందుకొచ్చామని తెలిపారు. పట్టాల కోసం పోరాడుతున్న అన్ని తండాల గిరిజన రైతులు, భూ పోరాట సమితి సభ్యులు పర్యటనలో పాల్గొని సమస్యలను వివరించాలని కోరారు.
పంచముఖికి
ప్రత్యేక బస్సులు
వనపర్తి టౌన్: అమావాస్య సందర్భంగా ఈ నెల 27న పంచముఖికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు బస్సులు బయలుదేరి పంచముఖికి చేరుతాయని.. దర్శనానంతరం మంత్రాలయం వెళ్లి అక్కడ దర్శనం పూర్తి చేసుకున్నాక తిరిగి పంచముఖికి చేరుకొని అదేరోజు రాత్రి బయలుదేరి ఉదయం 5 వరకు జిల్లాకేంద్రానికి చేరుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జూరాలకు 5,609
క్యూసెక్కుల వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్‌ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు.